: బారాముల్లాలో పోలీసులపై ఉగ్రవాదుల దాడి... ఆయుధాల అపహరణ
జమ్మూకాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో పోలీసులపై దాడి చేసిన ఇద్దరు ఉగ్రవాదులు, వారి వద్ద ఉన్న ఏకే-47 రైఫిల్ ను అపహరించుకుపోయారు. అయితే, ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, తుపాకితో మరో ఉగ్రవాది పారిపోయాడని అధికారులు తెలిపారు. ఈ తెల్లవారుజామున తావీ బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన జరిగిందని, గాయపడిన ఓ పోలీసును వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని తెలిపారు. పారిపోయిన ఉగ్రవాదిని పట్టుకునేందుకు సోదాలు జరుపుతున్నామని వెల్లడించారు. పట్టుబడిన ఉగ్రవాదిని విచారిస్తున్నట్టు తెలిపారు. వీరు ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, ఈ సంవత్సరంలో ఇటువంటి ఘటనలు ఆరు జరగడం గమనార్హం.