: హోలీ జరుపుకున్నందుకు రూ. 50 బాండ్ పేపర్ పై క్షమాపణలు రాయించుకున్న పాక్ వర్శిటీ
పాకిస్థాన్ లో మైనారిటీలుగా ఉన్న హిందువులు అనుభవిస్తున్న కష్టాలకు ఈ ఉదంతం మరో నిదర్శనం. సింధ్ యూనివర్శిటీలో విద్యను అభ్యసిస్తున్న ఓ హిందూ యువకుడు, హోలీ పండగను జరుపుకోవడంపై ఆగ్రహించిన వర్శిటీ యాజమాన్యం, అతని ఐడీ కార్డును తీసుకుని, బలవంతంగా క్షమాపణలు చెప్పించుకుంది. రూ. 50 రూపాయల బాండ్ పేపర్ పై క్షమాపణలు రాయించుకుంది. తాను తప్పు చేశానని క్షమాపణల పత్రంలో అతను రాయాల్సి వచ్చింది. కాగా, వర్శిటీలోని ఎంతో మంది విద్యార్థులు హోలీ పండగను జరుపుకున్నారని, ఆపై మెజారిటీ విద్యార్థుల నుంచి వచ్చిన ఒత్తిడితో యాజమాన్యం ఇతడే హోలీకి కారకుడని తేల్చింది. హిందూ విద్యార్థితో బలవంతంగా క్షమాపణలు చెప్పించుకున్న వర్శిటీ అధికారుల వైఖరిపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.