: ప్రతాపం చూపుతున్న భానుడు... ఆదిలాబాద్‌లో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఎండాకాలం ప్రారంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, భద్రాచలం, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండల్లో 40 డిగ్రీల చొప్పున నమోదయ్యాయని తెలిపారు. ఇక హన్మకొండ, హైదరాబాద్, రామగుండం, మెదక్, నిజామాబాద్‌లలో 39 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదయిందని తెలిపారు. రానున్న నాలుగు రోజులు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని చెప్పారు.