: ఎత్తు ఎక్కువ కనిపించాలని విగ్గుపెట్టుకుని వచ్చేశాడు.. బుక్కయ్యాడు!
పోలీసు ఉద్యోగం కొట్టాలని ఎంతో మంది యువకులు కలలు కంటుంటారు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, పోలీసు జాబు పొందాలని ఉత్సాహం, ఆశ ఉన్నప్పటికీ ఎంతో మంది అభ్యర్థులు ఎత్తు తక్కువగా ఉండడంతో ఆ ఉద్యోగాలకు ఎంపిక కాలేకపోతారు. అయితే, తాజాగా మహారాష్ట్రలో జరుగుతున్న పోలీసు నియామకాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. త్రయంబకేశ్వర్ నుంచి వచ్చిన రాహుల్ పాటిల్ అనే అభ్యర్థి తాను తక్కువ ఎత్తు ఉంటే ఎంపిక కానేమోనని భయపడ్డాడు. ఉద్యోగానికి ఎంపిక కావడానికి ఉండాల్సిన ఎత్తు లేకపోయినా ఉద్యోగం కొట్టేయాలని యోచించాడు.
ఎత్తును కొలిచేవారు తల పై నుంచి అరికాళ్లవరకు చూస్తారు కాబట్టి, హైటు ఎక్కువగా నమోదు కావడానికి ఓ విగ్గుపెట్టుకుని వచ్చాడు. అయితే, ఎంతో మంది దొంగల్ని పట్టుకునే పోలీసులకు ఆ విషయం కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు.. ఆ విషయాన్ని గుర్తించిన రిక్రూట్‌మెంట్‌లో ఉన్న అధికారులు ఆ విగ్గు ఊడదీసి అతడిపై అనర్హత వేటు వేసి పంపించారు. చట్టప్రకారం తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు.