: జగన్ సీఎం కావాలనుకోవడం తప్పా?: ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తోన్న వారిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. తమ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కావాలనుకోవడం తప్పా? అని నిలదీశారు. జగన్ తప్పకుండా సీఎం అవుతారని ఆయన ఉద్ఘాటించారు. అధికారం, మంత్రి పదవి, డబ్బుల కోసమే ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి జంప్ అయ్యారని రాచమల్లు విమర్శించారు. వారికి నైతికత లేదు కాబట్టే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయలేదని అన్నారు. వారంతా జగన్ వల్ల గెలిచి, ఇప్పుడు ఆయననే విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర డబ్బుల కోసం జగన్‌పై విమర్శలు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. వారితో అలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే మాట్లాడించారని ఆరోపించారు.