: బీజేపీని టీడీపీ కొత్తిమీర కట్టలా భావిస్తోంది!: విమర్శలు గుప్పించిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు
టీడీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి విమర్శలు గుప్పించారు. రాజధాని అమరావతి పేరుతో ఎందుకింత హడావుడి చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయని... ఏ రాష్ట్రం కూడా ఇంత హంగామా చేయలేదని చెప్పారు. ఛత్తీస్ గఢ్ రాజధాని నయా రాయ్ పూర్ ను ఆ రాష్ట్ర హౌసింగ్ బోర్డే నిర్మించిందని... టీడీపీ ప్రభుత్వం మాత్రం సింగపూర్, జపాన్ అంటూ హడావుడి చేస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో తాము మోదీ, చంద్రబాబు ఫొటోలతో ఓటర్ల వద్దకు వెళుతుంటే... టీడీపీ మాత్రం కేవలం చంద్రబాబు ఫొటోతోనే వెళుతోందని అసహనం వ్యక్తం చేశారు. బీజేపీని టీడీపీ కొత్తిమీర కట్టలా భావిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.