: పరిటాల రవి వరకు ఆ పంచాయితీ వెళ్లింది!: నటుడు శివాజీ రాజా
సినీ నటులు కొంత మంది కలసి బ్రహ్మానందం పేరు మీద కొన్నేళ్ల క్రితం వెల్ఫేర్ అసోసియేషన్ నెలకొల్పారు. అయితే, నిధుల ఖర్చు విషయంలో కొంచెం తేడా రావడంతో, అది పెద్ద గొడవకు దారి తీసింది. బ్రహ్మానందాన్ని కమెడియన్, ప్రస్తుత 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా నిలదీశాడు. చివరకు ఈ పంచాయితీ పరిటాల రవి, మోహన్ బాబుల వరకు కూడా వెళ్లింది. ఈ విషయాన్ని శివాజీ రాజానే స్వయంగా వెల్లడించాడు.
ఒకరోజు మోహన్ బాబు ఫోన్ చేసి... తను షూటింగ్ చేస్తున్న స్పాట్ కు శివాజీ రాజాను రమ్మని పిలిచారట. అక్కడే పరిటాల రవి కూడా ఉన్నారట. ఇంతలో అక్కడే ఉన్న శ్రీహరి ఫోన్ చేసి... 'ఇక్కడకు రావద్దురా, పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది' అని శివాజీ రాజాను హెచ్చరించాడట. అయితే, మోహన్ బాబుకు వస్తానని మాట ఇవ్వడంతో, అక్కడకు శివాజీ వెళ్లాడట.
అక్కడకు వెళ్లేసరికి మోహన్ బాబు షూటింగ్ లో ఉండగా... పరిటాల రవి మాత్రం చైర్ లో కూర్చున్నారట. ఆ సందర్భంగా పరిటాల రవి మాట్లాడుతూ, 'ఎందుకమ్మా గొడవలు... కామ్ గా ఉండండి' అని చెప్పారట. ఆ తర్వాత వచ్చిన మోహన్ బాబు... 'తమ్ముడూ టీ తాగు' అంటూ టీ ఇచ్చి... 'ఏమిటి ఈ గొడవలు?' అని ప్రశ్నించారట. దీంతో, 'ఏం లేదన్నయ్యా, ఇప్పుడు అంతా సెట్ అయింది' అని శివాజీ చెప్పాడట. దీంతో, 'వెరీ గుడ్, వెళ్లు' అని మోహన్ బాబు అన్నారట. దీంతో, హమ్మయ్యా అనుకుంటూ శివాజా రాజా బయటపడ్డాడట.