: మ్యాక్స్ వెల్ ను పెవిలియన్ పంపిన కుల్ దీప్ యాదవ్...స్మిత్ సెంచరీ
కుల్ దీప్ యాదవ్ మరోసారి ఆస్ట్రేలియా జట్టుకు షాకిచ్చాడు. ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో క్రీజులో నిలదొక్కుకుని స్టీవ్ స్మిత్ భారత్ బౌలర్లను సమర్ధవంతంగా అడ్డుకుంటుండగా... మరో ఎండ్ లో బ్యాటింగ్ కు వచ్చిన ఆటగాళ్లను వచ్చిన వాళ్లను వచ్చినట్టే పెవిలియన్ కు పంపుతూ టీమిండియా బౌలర్లు ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో రెండో వికెట్ కు వార్నర్, స్మిత్ జోడీ మంచి భాగస్వామ్యం నమోదు చేసిన ఆస్ట్రేలియా జట్టుకు షాకిస్తూ కుల్ దీప్ యాదవ్ వార్నర్ (56) ను పెవిలియన్ కు పంపాడు. తరువాత హ్యాండ్స్ కోంబ్ (8) కు ఊహించని షాకిచ్చాడు.
మరోసారి అద్భుతమై మిడ్ వికెట్ మీద సంధించిన కుల్ దీప్ యాదవ్ బంతిని అర్థం చేసుకోవడంలో గ్లెన్ మ్యాక్స్ వెల్ (8) పొరపాటు పడ్డాడు. బాలు లెగ్ సైడ్ వెళ్తుందని భావించిన మ్యాక్స్ వెల్ బ్యాక్ పుట్ తీసుకుని మిడ్ వికెట్ మీద బ్యాటు పెట్టి, లెగ్ వికెట్ మీద కాలు ఉంచాడు. అయితే, అతను ఊహించని విధంగా బాల్ ఆఫ్ స్టంప్ బెయిల్ ను గిరాటేస్తూ అతనిని పెవిలియన్ కు పంపింది. దీంతో ఆసీస్ ఐదు వికెట్లు కోల్పోయింది. రెన్ షా (1), షాన్ మార్ష్ (4) ను ఉమేష్ యాదవ్ అవుట్ చేసిన సంగతి తెలిసిందే. స్మిత్ (100) కు వేడ్ (1) జతకలిశాడు. దీంతో 52 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు 191 పరుగులు చేయగా, టీమిండియా బౌలర్లలో కుల్ దీప్ యాదవ్ మూడు వికెట్లతో రాణించగా, ఉమేష్ యాదవ్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు.