: యాదవ్స్ స్ట్రైక్స్ అగైన్...ఆసీస్ కు షాక్
హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్ కు కొత్త కుర్రాడు కుల్ దీప్ యాదవ్ షాకిచ్చాడు. పేస్ బౌలింగ్, బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ అంటూ విశ్లేషణలు వినిపించిన పిచ్ పై స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్ అద్భుతమైన బౌన్స్ తో పాటు స్పిన్ రాబట్టుకుంటున్నాడు. ఊహించని బంతులతో ఆసీస్ ఆటగాళ్లను షాక్ కు గురి చేస్తున్నాడు. వార్నర్ ను ఆత్మరక్షణలోకి నెట్టి వికెట్ రాబట్టుకున్న కుల్ దీప్...హ్యాండ్స్ కొంబ్ (8) అంచనాలకు అందని బంతి వేసి...అతనితోపాటు, టీమిండియా సహచరులు, కామెంటేటర్లను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
మిడిల్ స్టంప్ ను లక్ష్యం చేసుకుని కుల్ దీప్ యాదవ్ సంధించిన బంతిని డిఫెన్స్ ఆడడానికి హ్యాండ్స్ కోంబ్, ఫీల్డింగ్ కు సిద్ధమయ్యేందుకు ఫీల్డర్లు సిద్ధంగా ఉన్న క్షణంలో ఊహించని విధంగా బ్యాటు, కాళ్ల మధ్యనుంచి బాల్ దూసుకెళ్లి వికెట్లను గిరాటేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. హ్యాండ్ కోంబ్ అయితే షాక్ తో నివ్వెరబోయాడు. టీమిండియా స్పీడ్ స్టర్ ఉమేష్ యాదవ్ బంతిని స్వింగ్ చేస్తూ రెన్ షా (1), షాన్ మార్ష్ (4) ను పెవిలియన్ కు పంపిన సంగతి తెలిసిందే. దీంతో నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు 45 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో ఉమేష్ యాదవ్, కుల్ దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నారు. క్రీజులో స్టీవ్ స్మిత్ (93), మ్యాక్స్ వెల్ (1) వున్నారు.