: ఇంత కష్టం ఎవరికీ రాకూడదు... 'ఆ కథ కాని కథ' చదివిన వారు కన్నీరు పెట్టుకుంటున్నారు!


ప్రముఖ వెబ్ సైట్ కోరాలో ఆయా వ్యక్తుల ప్రశ్నలకు పలువురు సమాధానాలు చెబుతుంటారు. ఫిబ్రవరి 2017లో ఓ నెటిజన్ కోరా వెబ్‌ సైట్‌ ను ‘కళ్ల ముందు బిడ్డ చనిపోవడం బాధాకరమా? లేక తల్లిదండ్రులు చనిపోవడం బాధాకరమా?’ అని ప్రశ్నించాడు. దీనికి లిరిన్ చాకో అనే వ్యక్తి సమాధానం చెప్పాడు. ఈ సందర్భంగా తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈ అనుభవం చదివిన ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చేలా చేసింది.

ఇంతకీ లిరిన్ చాకో ఏం చెప్పాడంటే... ‘‘నాపేరు లిరిన్ చాకో, నా వయసు 32 ఏళ్లు. నా భార్య వయసు 28. మేము పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం చేసుకున్నాం. మా ఇద్దరిదీ అన్యోన్య దాంపత్యం. మా జీవితం నిండా ఆనందమే... మాకు చావులు తెలియవు. తెలిసిన వారి చావులకు వెళ్లాల్సిన అవసరం రాలేదు. దీంతో సమాధులను కూడా దగ్గరగా చూడలేదు. నేను ఒక పేరున్న సంస్థకు డైరెక్టర్ ని కావడంతో జీవితం ఆనందంగా సాగిపోతోంది. మా ప్రేమకు గుర్తుగా జోర్డాన్‌ అనే పాప పుట్టింది. మా జీవితాల్లోకి మరింత సంతోషం వచ్చి చేరింది. సరిగ్గా మా పాపకు 31 నెలల వయసువచ్చినప్పుడు ఊహించన విధంగా మా కారుకు యాక్సిడెంట్‌ అయింది. ఆ ఒక్క ఘటన మా ఆనందాన్ని చిదిమేసింది. జీవితంలో విషాదం అంటే తెలిసివచ్చిన సందర్భమది. మా డ్రైవర్ రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. నా చిట్టితల్లి ఆరు రోజులు కోమాలో ఉండి మరణించింది. నా భార్యకి తలలో 11 చోట్ల ఫ్రాక్చర్‌ అయింది.... అల్లారు ముద్దుగా పెంచుకున్న నా చిట్టితల్లిని పూడ్చిపెట్టిన రోజు నాకింకా గుర్తుంది.

 నాకు, నా భార్యకు ఏడుపొస్తున్నా ఏడ్వలేనంత నొప్పితో బాధపడ్డాం. ఒక్కసారిగా మా జీవితాల్లో చీకటి అలముకుంది. ఆ ఒక్క ఘటనతో మా జీవితాలు తల్లికిందులైపోయాయి. మేమిద్దరం ఒకరికి ఒకరుగా నిలబడ్డాం... ఎవరితోనూ మాటలు లేవు. యాక్సిడెంట్‌ తరువాత ఒక్కగానొక్క కుమార్తె పోవడంతో నేను నా భార్యను మరింత ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాను. అయితే అది బాధను ఆపేస్తుందా? ఎంత ప్రేమగా చూసినా మా పాప మా జీవితాల్లో లేదనే బాధ గుండెలను పిండేసేది. ఏం చేసినా అందులోంచి బయటకు రాలేకపోయేవారం... దీంతో ప్రతి నెలా నా చిట్టితల్లిని పాతిపెట్టిన సమాధి వద్దకు వెళ్లే వాళ్లం. గంటల తరబడి సమాధితో మాట్లాడేవాళ్లం.

సమాజంతో పనిలేకుండా కేవలం సినిమాలు చూస్తూ గడిపేవాళ్లం. దీంతో మా ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. కొత్త కొత్త ఆలోచనలు చుట్టుముట్టేవి... మాకు చావంటే భయంలేదు. ఇంకా చెప్పాలంటే తొందరగా చనిపోయి మా పాప వద్దకు వెళ్లాలనుకున్నాం. ఆ తరువాత మమ్మల్ని చూసిన వారంతా ‘మీరెంతో అదృష్టవంతులు, కనీసం ప్రాణాలతో బయటపడ్డారు’ అనేవాళ్లు. నా భార్య ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో మేము జీవశ్చవాల్లా ఉంటున్నాం. రాత్రుళ్లు కునుకు తీస్తూనే కుమిలి పోయేవాళ్లం. ఏడుస్తూ వున్నా ప్రాణాలు పోతాయని ఆశగా ఎదురు చూసేవాళ్లం. అయితే, ఇంతటి మా బాధను మా తల్లిదండ్రులకు ఏనాడూ కనిపించనివ్వలేదు... ఎందుకంటే కడుపుకోత ఎలా ఉంటుందో రుచి చూసిన వాళ్లము కనుక వారికి మా బాధ కనిపించనివ్వలేదు.

రోజులు గడుస్తున్న కొద్దీ బాధను భరించడానికి అలవాటు పడ్డాం. ఆ బాధతోనే నా బిజినెస్‌ నేను చూసుకుంటున్నా. నా భార్య టీచర్‌ గా ఓ స్కూల్ లో పనిచేస్తోంది. ఆ బాధ నుంచి తేరుకునేందుకు దేవుడు మాకు మరో పాపను ప్రసాదించాడు. ఆమెకు జేడిన్ అని పేరుపెట్టుకున్నాము. ఇప్పుడు మేము ముగ్గురూ ఆనందంగా ఉన్నామా? అంటే ఉన్నాము... కానీ జోర్డాన్ లేదనే బాధ ఈ క్షణానికి కూడా మమ్మల్ని వదల్లేదు. ఈ బాధ ఎప్పటికీ తొలచివేస్తుంది. ఇప్పటికీ జోర్డాన్ గుర్తొస్తే నవ్వులు ఆగిపోతాయి.

కనుక ఎవరూ తమ కన్న బిడ్డ చావు చూడాలని నేను కోరుకోను... ఎందుకంటే దానిని మించిన నరకం మరోటి ఉండదు. అందుకు సజీవ ఉదాహరణ మేమే. ఇకపోతే మీరడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే..... తల్లిదండ్రులు చనిపోతే పిల్లలు తమని తాము కోల్పోయిన వారవుతారు. అదే ఓ బిడ్డను పోగొట్టుకుంటే ఆ తల్లిదండ్రులు జీవచ్ఛవాలుగా మిగిలిపోతారు’’ అంటూ లిరిన్ రాసిన వ్యథ నెటిజన్ల మనసులను తాకుతోంది. దీనిని చదివిన వారంతా కన్నీటి పర్యంతమవుతున్నారు.

  • Loading...

More Telugu News