: 20 నిమిషాలు నాకు సమయం ఇచ్చి ఉంటే నేను మీడియా ముందుకు వచ్చే పరిస్థితి వచ్చేది కాదు: జగన్
అగ్రిగోల్డ్ బాధితులు ఇచ్చిన ఆధారాలనే తాను శాసనసభలో చూపించాలనుకున్నానని, ఆ పని చేయనివ్వకుండా తనకు మైకు ఇవ్వలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఈ రోజు సభలో 20 నిమిషాలు సమయం ఇచ్చి ఉంటే ఇప్పుడు మీడియా సమావేశం పెట్టాల్సి వచ్చేది కాదని అన్నారు. పెద్దలంతా ఆస్తులని గద్దల్లా తన్నుకుపోతున్నారని తనతో అగ్రిగోల్డ్ బాధితులు చెప్పారని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల గురించి మాట్లాడుతోంటే మధ్యలోనే స్పీకర్ మైకు కట్ చేశారని అన్నారు.
అగ్రిగోల్డ్ అంశం చర్చించే సమయంలో అసెంబ్లీలో స్పీకర్ మీట్ ది ప్రెస్ వీడియో చూపించారని, టాపిక్ ని పక్కదారి పట్టించేందుకే అలా చేశారని జగన్ అన్నారు. అంత దారుణంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. ఈ రోజు అగ్రిగోల్డ్‌పై కేవలం 20 నిమిషాలు సమయం ఇవ్వండని కోరానని, దానికి కూడా అనుమతి ఇవ్వకపోవడం ఏంటని అన్నారు. ఈ సాక్ష్యాధారాలు తనకు బాధితులే ఇచ్చారని అన్నారు. ఆస్తులు లాక్కునే కార్యక్రమాన్ని ఆపాలని వారు తనని కోరారని అన్నారు.