: గ్యాంగ్ రేప్ బాధితురాలిని కలిసిన యూపీ సీఎం


గ్యాంగ్ రేప్ కు గురైన ఓ మహిళ గత ఎనిమిదేళ్లుగా న్యాయం కోసం కోర్టులో పోరాడుతోంది. ఈ నేపథ్యంలో, ఇద్దరు వ్యక్తులు ఆమె చేత బలవంతంగా యాసిడ్ తాగించారు. దీంతో, చావు బతుకుల మధ్య ఆమె ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది. లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ కాలేజి ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమెను... యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరామర్శించారు. ఆమె అవసరాల కోసం తక్షణ సాయంగా లక్ష రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. అంతేకాదు, ఆమెకు బలవంతంగా యాసిడ్ తాగించిన వాళ్లను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు.

2008లో రాయ్ బరేలీలో ఆమెపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారం జరిపారు. అంతేకాక ఆమెపై యాసిడ్ పోశారు. ప్రస్తుతం ఆమె యాసిడ్ దాడి బాధితులకు ఉద్యోగాలు కల్పించే ఓ కేఫ్ లో పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో, తన పిల్లలను కలిసేందుకు లక్నోకు 100 కిలోమీటర్ల దూరంలో ఉండే ఊంచహార్ కు వెళ్తుండగా ఆమెపై మరోసారి దాడి జరిగింది. ఆమె చేత యాసిడ్ తాగించారు.

ఈ సందర్భంగా ఆమె భర్త మాట్లాడుతూ, తాను నిరుపేదనైనప్పటికీ  తన భార్యను నమ్ముతానని... అందుకే ఈ కేసులో పోరాడుతున్నానని తెలిపాడు. ముఖ్యమంత్రి తమను పరామర్శించడం సంతోషాన్ని కలిగించిందని చెప్పాడు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరాడు. 

  • Loading...

More Telugu News