: చీము, నెత్తురు ఉన్నవారు.. ఉప్పు, కారం తింటున్న వారు ఈ సవాలును ఒప్పుకోవాల్సిందే!: విష్ణుకుమార్ రాజు
తాము చేసిన ఆరోపణలపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేసిన వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు శాసనసభ నుంచి వెళ్లిపోతున్నారని శాసనసభలో విష్ణుకుమార్ రాజు విమర్శించారు. చీము, నెత్తురు ఉన్నవారు.. ఉప్పు, కారం తింటున్న వారు ప్రత్తిపాటి విసిరిన సవాలును ఒప్పుకోవాల్సిందేనని అన్నారు. ప్రతిపక్ష హోదా అంటే అధికార పక్షంలో తప్పు చేస్తే ఆ విషయాన్ని తెలిపి, ఆరోపణలు నిరూపించి, తప్పును సరిదిద్దేలా చేయాలని అన్నారు. అంతేకానీ ఇలా సమయాన్ని వృథా చేయడం కాదని అన్నారు. వారు తప్పులు చెబితే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది కానీ ఇలా చేస్తే ఫలితం ఏమీ ఉండదని అన్నారు. శాసనసభ నియమాలను అందరూ పాటించాల్సిందేని చెప్పారు.
ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం దురదృష్టకరమని విష్ణుకుమార్ రాజు చెప్పారు. అసత్య ఆరోపణలు చేస్తూ సభలో చెలరేగిపోకూడదని అన్నారు. న్యాయ విచారణ వేయాలని చెప్పిన ఆయనే.. ఇప్పుడు అధికార పార్టీ అందుకు ఒప్పుకున్నా.. సభనుంచి వెళ్లిపోతున్నారని అన్నారు. ఒకవేళ సవాలుకు ఒప్పుకోకపోతే క్షమాపణ అయినా చెప్పాలని అన్నారు. శాసనసభలో రెడ్ జోన్ అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.