: జగన్ వైఖరిని నిరసిస్తూ తీర్మానం ప్రవేశపెట్టిన యనమల
శాసనసభలో ప్రతిపక్ష నేత జగన్ వైఖరిని నిరసిస్తూ మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష నేత వైఖరి వల్ల అత్యంత విలువైన రెండు రోజుల సభాసమయం వృథా అయిందని విమర్శించారు. తనపై అవినీతి ఆరోపణలను జగన్ చేసిన నేపథ్యంలో సభాసంఘం విచారణకు తాను సిద్ధమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారని... అయితే, సిట్టింగ్ జడ్జితో విచారించాలంటూ జగన్ డిమాండ్ చేశారని...దానికి కూడా ముఖ్యమంత్రి ఒప్పుకున్నారని యనమల చెప్పారు.
అయితే, తప్పు తనదని తేలితే తాను సభ నుంచి తప్పుకుంటానని... తన తప్పు లేదని తేలితే జగన్ తప్పుకోవాలని పుల్లారావు డిమాండ్ చేశారని... ఈ నేపథ్యంలో, విచారణకు డిమాండ్ చేసిన జగన్ వెనక్కి తగ్గారని విమర్శించారు. నిరాధార ఆరోపణలు చేసి, ప్రభుత్వ గౌరవాన్ని దెబ్బతీయాలనుకోవడం ప్రతిపక్ష విధానంగా మారిందని మండిపడ్డారు. సభా సమయాన్ని వృథా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.