: ఎవరూ ఊహించని విధంగా... బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధమన్న మమతా బెనర్జీ
త్వరలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీని ఆ పార్టీ పోటీకి దింపితే, తాము మద్దతిస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సూచన ప్రాయంగా వెల్లడించారు. ఓ బెంగాలీ టెలివిజన్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, అద్వానీని రాష్ట్రపతిగా చూడాలని అనుకుంటున్నట్టు తెలిపారు. ఆ పార్టీ మహిళా నేతలైన సుష్మా స్వరాజ్, సుమిత్రా మహాజన్ లలో ఎవరిని నిలిపినా కూడా తాము మద్దతిస్తామని అన్నారు. యూపీలో బీజేపీ అధికారంలోకి రావడాన్ని తాము నమ్మలేకున్నామని, ఇప్పటికైనా అఖిలేష్, రాహుల్ కోర్టుకు వెళ్లాలని సలహా ఇచ్చారు. మరో రెండేళ్లలో జరిగే సాధారణ ఎన్నికల్లో సమాజ్ వాదీ, బహుజన సమాజ్ పార్టీలతో కలసి పోటీ చేయాలన్న ఆలోచన ఉందని తెలిపారు. కాగా, అవకాశం చిక్కితే ప్రధానిపై విమర్శలు గుప్పించే మమత రాష్ట్రపతి ఎన్నికల విషయంలో స్వరం మార్చడం గమనార్హం.