: అలా వక్రీకరించడం చాలా బాధగా అనిపిస్తోంది: అసెంబ్లీలో స్పీకర్ కోడెల
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన మహిళా పార్లమెంటేరియన్ సదస్సు సందర్భంగా నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ లో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించిన స్పీకర్ కోడెల శివప్రసాద్ ఈ రోజు సంబంధిత వీడియోను అసెంబ్లీలో చూపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించడం తనకు చాలా బాధ కలిగిస్తోందని అన్నారు. అంతేగాక, తన కుమారుడు, కోడలి గురించి కూడా సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టారని ఆయన అన్నారు. తాను అనని మాటలు అన్నట్లు చూపించం ఏంటని ప్రశ్నించారు. ఇటువంటి చర్యలు అన్యాయం, అక్రమం అని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ... స్పీకర్ ను అగౌరవపరిస్తే ప్రజలందరినీ అగౌరవపరచడమేనని అన్నారు. ఆ వ్యాఖ్యల వీడియోను ప్రతిపక్ష నాయకుడు, సభ్యులు కూడా చూడాలని అన్నారు. ఒకరి క్యారెక్టర్‌ను ఇలా చెడుగా చూపించడం అన్నది జగన్‌కు చెందిన మీడియాకే చెల్లిందని అన్నారు.