: అప్పట్లో ప్రభాస్ సినిమా నుంచి నన్ను తీసేశారు: రకుల్ ప్రీత్ సింగ్
కాలేజీలో ఉండగానే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించిన రకుల్ ప్రీత్ సింగ్... 19 ఏళ్ల వయసులోనే వెండితెరకు పరిచయం అయింది. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమాతో టాలీవుడ్ లో తొలి విజయం అందుకుంది. ఈ సినిమా విజయవంతం అయినా, మరో రెండేళ్ల వరకు ఆమెకు సరైన అవకాశాలు రాలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్రహీరోలతో వరుస సినిమాలు చేస్తూ, క్షణం తీరిక లేకుండా ఉన్న రకుల్... తన తొలి నాళ్ల గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
'కెరటం' అనే సినిమాలో ఓ ఐదు నిమిషాల రోల్ ను చేశానని రకుల్ తెలిపింది. పాకెట్ మనీ కోసం ఓ కన్నడ సినిమాలో చేశానని... ఆ తర్వాత పూరీ జగన్నాథ్ తనకు ఓ కథ చెప్పారని... కానీ, చదువు పాడవుతుందని ఆ సినిమా చేయలేదని చెప్పింది. ఆ తర్వాత యాక్టింగ్ ను సీరియస్ గా తీసుకుందామనుకున్న తరుణంలో ప్రభాస్ హీరోగా 'మిస్టర్ పర్ ఫెక్ట్' సినిమాలో అవకాశం వచ్చిందని... నాలుగు రోజుల పాటు షూటింగ్ లో కూడా పాల్గొన్నానని... కానీ, ఎందుకో తనను ఆ సినిమా నుంచి తీసేశారని తెలిపింది. కొన్ని పెద్ద సినిమాలకు కూడా తనను తీసుకుని, ఆ తర్వాత మార్చేశారని చెప్పింది.