: లా కమిషన్ సిఫార్సు.. భారత్ లో ఉరిశిక్ష రద్దు?
మన దేశంలో ఉరి శిక్షను రద్దు చేయనున్నారా? అంటే కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హన్స్ రాజ్ ఆహిర్ రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం చూస్తే నిజమేనని అనిపిస్తోంది. 'ఉరి శిక్షను రద్దు చేయనున్నారా?' అంటూ రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఉరిశిక్షను రద్దు చేయమంటూ కేంద్రప్రభుత్వానికి లా కమిషన్ సిఫార్సు చేసిందని రాజ్యసభలో హన్స్ రాజ్ ఆహిర్ ప్రకటించారు.
ఉగ్రవాదంతో ముడిపడి ఉన్న కేసుల్లో మాత్రం దీనిని అమలు చేయాలని లాకమిషన్ సిఫారసు చేసిందని ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ మేరకు లా కమిషన్ సూచనలను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపామని ఆయన చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి దీనిపై సలహాలు, సూచనలు కోరామని, వారి సలహాలు వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.