: అందుకే, ‘కాటమరాయుడు’ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ పగలబడి నవ్వారు: వెల్లడించిన హాస్యనటుడు అలీ
ఈ నెల 18న హైదరాబాద్ లో ‘కాటమరాయుడు’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరిగిన విషయం విదితమే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరో గా రూపొందిన ఈ చిత్రంలో అలీ కూడా నటించాడు. అయితే, ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకలో పాల్గొన్న పవన్ ఓ సందర్భంలో పగలబడి నవ్వాడు. మరి, పవన్ కు అంతగా నవ్వు తెప్పించిన మాటలు ఏంటనే విషయం ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చూస్తున్న ఆయన అభిమానులకు, ఆహూతులకు అర్థం కాలేదు.
అయితే, పవన్ పక్కనే నిలబడి ఉన్న అలీ, ఏదో జోక్ పేల్చుంటాడని కొందరు ఊహించారు. ఆ నవ్వుల వెనుక జరిగిన కథేంటన్నది తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో అలీ చెప్పేశాడు. ‘ఆ రోజు నిర్మాత శరత్ మరార్ వేదికపై మాట్లాడుతూ, ‘జుబ్బాలో పవన్ అందం రెట్టింపు అయింది’ అన్నారు. ఇదే సమయంలో పక్కనున్న వారితో నేను అన్నాను .. ‘ఏంటీ, హ్యాండ్సమ్ గా ఉన్నారు.. హ్యాండ్సమ్ గా ఉన్నారు.. అని ఆయన అన్ని సార్లు అంటున్నారు.. కొంపదీసి, మళ్లీ పెళ్లి చేస్తారా ఏంటి? అని అన్నాను. పక్కనే ఉన్న పవన్ కల్యాణ్ ఈ మాటలు విని పగలబడి నవ్వారు. అయితే, పవన్ అలా ఎందుకు నవ్వారనే విషయాన్ని తెలుసుకునేందుకు ఆయనకు చాలా ఫోన్లు వచ్చాయి’ అని అలీ చెప్పుకొచ్చాడు.