: ప్రత్యేక అసెంబ్లీ కోసం కూడా వైసీపీ పట్టుబడుతుంది: మంత్రి పల్లె ఎద్దేవా
తమకు ప్రత్యేక అసెంబ్లీ కావాలని కూడా వైసీపీ నేతలు పట్టుబడతారంటూ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ దౌర్జన్యం చేశారంటే ఎవరైనా నమ్ముతారని... చెవిరెడ్డి దౌర్జన్యం చేశారంటే నమ్ముతారని... తాను దౌర్జన్యం చేశానంటే ఏపీలో ఎవరూ నమ్మరని ఆయన అన్నారు. సహనంతో వ్యవహరించాలంటూ తమ అధినేత చంద్రబాబు తమకు చెబుతూ ఉంటారని... ఆయన సూచనల మేరకు తామంతా సంయమనంతో వ్యవహరిస్తుంటామని చెప్పారు.
మీడియా పాయింట్ వద్ద మాట్లాడే విషయంలో సంయమనం పాటించాలని వైసీపీకి సూచించారు. వైసీపీ వాళ్లు ఒకరు మాట్లాడిన తర్వాత, తమ పార్టీ వారికి ఒకరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పారు. అంతేకానీ, మొత్తం వారే మాట్లాడాలనుకుంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రత్యేక మీడియా పాయింట్ కావాలని అడిగిన వైసీపీ నేతలు... రేపు వారికొక అసెంబ్లీ, టీడీపీకి ఒక అసెంబ్లీ కావాలని కూడా అడుగుతారేమోనని ఎద్దేవా చేశారు.