: నాకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రూపానీ తెలుసు బెయిలివ్వండి: కోర్టును కోరిన నిందితుడు
గుజరాత్ లోని వడోదరలోని గాయత్రి సొసైటీలో జరిగిన కోట్లాది రూపాయల ఫోర్జరీ కేసులో చార్జిషీట్ లో మాజీ కార్పొరేటర్ హసిత్ తలాటి పేరును పోలీసులు జత చేశారు. దీంతో ముందస్తు బెయిల్ కు లాయర్ ద్వారా ప్రయత్నించిన తలాటీ తాను వడోదరలో వ్యాపారవేత్తనని, బీజేపీలో చాలా కాలం పని చేశానని, ఒక పర్యాయం కార్పొరేటర్ గా కూడా పని చేశానని, తనకు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా బాగా తెలుసని కోర్టులో ఫోటోలు చూపించి, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని డిమాండ్ చేశాడు.
దీనిని పరిశీలించిన న్యాయస్థానం ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి తెలిసినంత మాత్రాన కోర్టుకు సరిపోదని, నిర్దోషిత్వం నిరూపించుకోవాలని చెబుతూ అతని బెయిల్ పేపర్లను బుట్టదాఖలు చేసింది. దీంతో సవరించిన బెయిల్ దరఖాస్తును న్యాయవాది మరోసారి న్యాయస్థానానికి సమర్పించారు. దీనిపై న్యాయవాది మాట్లాడుతూ, తమ క్లయింట్ దేశం విడిచి పారిపోయేవాడు కాదని చెప్పేందుకే ఆ ఫోటోలు చూపించాల్సి వచ్చిందని చెప్పడం కొసమెరుపు.