: సిద్ధూ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు... మీకెందుకంత కడుపు మంట అంటూ సిద్ధూ ఫైర్


భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే, మంత్రిగా బాధ్యతలను స్వీకరించినా, టీవీ షోలలో కూడా తాను కొనసాగుతానని సిద్ధూ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి కూడా, టీవీ షోలలో పాల్గొనడం ఏమిటని ప్రతిపక్ష నేతలు సిద్ధూపై మండిపడుతున్నారు.

వీరి విమర్శలపై సిద్ధూ కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ డిప్యూటీ సీఎం సుఖ్ బీర్ సింగ్ బాదల్ తరహాలో తాను ఏమైనా బస్సులను నడిపానా? అని ఆయన ప్రశ్నించారు. లేక తానేమైనా అవినీతి అక్రమాలకు పాల్పడ్డానా? అని నిలదీశారు. నెలకు కేవలం నాలుగు రోజులు... అది కూడా రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే పని చేసుకుంటానంటే... మీకు ఎందుకు కడుపుమంట? అని సిద్ధూ నిప్పులు చెరిగారు.

మరో వైపు ఈ అంశంపై న్యాయ సలహా తీసుకుంటామని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తెలిపారు. సిద్ధూ ప్రస్తుతం కపిల్ శర్మకు చెందిన రియాలిటీ షో 'కామెడీ నైట్స్'కు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

  • Loading...

More Telugu News