: ముస్లిం మహిళలు కూడా నీకు ఓటేశారు.. హృదయాలు గెలుచుకో!: యూపీ సీఎంకు తండ్రి సలహా
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఆయన తండ్రి ఆనంద్ సింగ్ బిష్త్ ఓ సలహా ఇచ్చారు. ప్రతి ఒక్కరినీ కలుపుకుని వెళ్లాలని... ముస్లిం మహిళలు కూడా నీకు ఓటేశారని... అన్ని మతాలను గౌరవించాలని... అందరి హృదయాలను గెలుచుకోవాలని తన కుమారుడికి ఆయన సలహా ఇచ్చారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ 84 సంవత్సరాల బిష్త్ ఈ సలహాను ఇచ్చారు. తన కుమారుడి మీద ఎంతో బాధ్యత ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
ట్రిపుల్ తలాక్ తో పాటు ఇతర సమస్యల నుంచి కూడా బీజేపీ తమను రక్షిస్తుందని ముస్లిం మహిళలు భావించారని... ఆ ఆశతోనే బీజేపీకి ఓటు వేశారని బిష్త్ తెలిపారు. అన్ని మతాలకు చెందిన ప్రజలను యోగి సమానంగా చూడాలని... రాష్ట్రాన్ని ప్రగతిపథంలో పరుగులు పెట్టించాలని ఆకాంక్షించారు. ప్రజల మనసులు గాయపడేలా యోగి వ్యాఖ్యలు చేయరాదని సూచించారు. తన కుమారుడు ఎంతో చిత్తశుద్ధి కలిగిన వ్యక్తి అని కితాబిచ్చారు. హిందూ మత ప్రచారకర్తగా ఉన్న మచ్చను యోగి చెరిపేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. యోగి తండ్రి బిష్త్ అటవీశాఖ అధికారిగా పనిచేశారు.