: కోహ్లీ కూడా డొనాల్డ్ ట్రంప్ లాంటి వాడే!: టీమిండియా కెప్టెన్ పై విరుచుకుపడ్డ ఆస్ట్రేలియా మీడియా
భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌ల మధ్య వాగ్యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఆస్ట్రేలియా మీడియా ఈ రోజు మరింత రెచ్చిపోయింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని క్రీడా ప్రపంచంలో డొనాల్డ్ ట్రంప్ అని పేర్కొంది. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లాగే కోహ్లీ కూడా మీడియానే నిందిస్తున్నాడని డైలీ టెలిగ్రాఫ్ అనే పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.
ఇటీవల బెంగళూరు టెస్టు కొనసాగుతున్న నేపథ్యంలో డీఆర్ఎస్ కోసం స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ వైపు చూడటం పట్ల కోహ్లీ తీవ్ర అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. అప్పుడు మొదలైన ఈ గొడవ ఇంకా చల్లారలేదు. సందుదొరికితే ప్రత్యర్థులపై ఇటువంటి కథనాలే ప్రచురించే ఆస్ట్రేలియా మీడియా ఇప్పుడు కోహ్లీపై ఇటువంటి వ్యాఖ్యలు చేస్తోంది.