: ఇది దారుణం.. సేవింగ్స్ ఖాతాలపై ఎస్బీఐ నిబంధనలు ఎత్తివేయాలి: రాజ్యసభలో విపక్షాల డిమాండ్
భారతీయ స్టేట్ బ్యాంకు ఇటీవల తీసుకొచ్చిన పలు నిబంధనలపై ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై ఈ రోజు రాజ్యసభలో విపక్షాలు గళమెత్తాయి. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో కనీసం రూ.5 వేల బ్యాలెన్స్ ఉంచాలన్న బ్యాంకు నిబంధనపై విపక్ష సభ్యులు మండిపడ్డారు. కొత్త నిబంధనలన్నింటినీ తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. సీపీఐ సభ్యుడు కేకే రాజేశ్ ఈ అంశంపై మాట్లాడుతూ... మినిమం బ్యాలెన్స్ లేకుంటే జరిమానా విధిస్తామని చెప్పిన ఎస్‌బీఐ ప్రకటన దారుణమని అన్నారు. ఆ నిబంధన వల్ల దాదాపు 31 కోట్ల మంది ఖాతాదారులు ఇబ్బందిపడతారని ఆయన పేర్కొన్నారు. సర్కారు ఆదేశాల మేరకు బ్యాంకు ఖాతా తెరిచి, నగదు రహిత లావాదేవీలు చేస్తోన్న పేద, మధ్య తరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడతారని చెప్పారు. ఆ బ్యాంకు వచ్చే నెల 1 నుంచి తీసుకురానున్న ఈ నిబంధనలపై ప్రభత్వం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.