: సింహం సింగిల్ గానే వస్తుంది: రోజా
నేడు వెల్లడైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచినట్టు కాదని, నైతిక విజయం వైకాపాదేనని ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. రూ. 300 కోట్లు ఖర్చు పెట్టి ముగ్గురిని గెలిపించుకున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది చాలక, సిగ్గులేకుండా సంబరాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. తమ పార్టీ నేత జగన్ సింహం లాంటివారని, సింహం సింగిల్ గానే వస్తుందని, ప్రజాక్షేత్రంలో గెలుపు తమదేనని అన్నారు.
తెలంగాణలో ఓటుకు నోటు కేసులో శిక్ష పడకపోవడంతోనే చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో కోట్లాది రూపాయలు కుమ్మరించి స్థానిక సంస్థల ఓట్లను కొనేశారని ఆరోపించారు. గతంలో 147 ఓట్ల తేడాతో గెలిచిన శిల్పా చక్రపాణి, ఇప్పుడు కేవలం 57 ఓట్ల మెజారిటీతో సరిపెట్టుకున్నారని గుర్తు చేసిన ఆమె, తెలుగుదేశం గెలిచినట్టో... ఓడినట్టో వారే అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రజాబలం ఉందని నిజంగా నమ్మితే, వైకాపా నుంచి గెలిచి ఫిరాయించిన 21 మందితో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు.