: హైదరాబాదులో ఆటో డ్రైవర్ నుంచి రోజుకూలీ వరకూ ఎవరిని అడిగినా నా పేరే చెబుతారు!: చంద్రబాబు
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎంగా, విపక్ష నేతగా తానే పని చేశానని, హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసి అంతర్జాతీయ స్థాయిలో నిలిపానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం అసెంబ్లీలో మాట్లాడుతూ, హైదరాబాద్ కు ఇంత పేరు రావడానికి కారణమెవరని ఆటో డ్రైవర్ నుంచి రోజుకూలీ వరకూ ఎవరిని అడిగినా తన పేరే చెబుతారని చెప్పారు.
2004లో తాను చేపట్టిన పటిష్టమైన ఆర్థిక విధానాల వల్లనే ఇది సాధ్యమైందని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, ఆనాడు విపక్ష నేతగా ఉన్న జనార్దన్ రెడ్డి కూడా జగన్ మాదిరిగా మాట్లాడుతూ ఉంటే, వచ్చే ఎన్నికల్లో నువ్వు గెలవవని హెచ్చరించానని అదే జరిగిందని అన్నారు. రాష్ట్రంలో హైకమాండ్ లేకుండా ప్రజల మెప్పు పొందిన వ్యక్తులు ఇద్దరేనని, ఒకరు ఎన్టీఆర్ కాగా, రెండో వ్యక్తి తానేనని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా సోనియా, ఇందిరాగాంధీల ఫోటోలు పెట్టుకుని ఓట్లను అడిగారని అన్నారు. హైదరాబాద్ లానే అమరావతిని అభివృద్ధి చేస్తామని, చరిత్రను తిరగరాసే సత్తా తమకుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.