: తన పాటలు పాడద్దంటూ.. ఇళయరాజా పేరిట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు నోటీసులు!


మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా పేరిట ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి నోటీసులు అందాయి. వరల్డ్ టూర్ లో భాగంగా పలు దేశాల్లో కచేరీలు ఇస్తున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎక్కువగా ఇళయరాజా పాటలు పాడుతున్నారని, ఇంకెప్పుడూ ఆ పాటలు పాడ కూడదంటూ ఆయనకు నోటీసులు వచ్చాయి. ఈ విషయమై తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా బాలసుబ్రహ్మణ్యం స్పందించారు.

గత ఆగస్టులో ‘ఎస్పీబీ 50’ పేరిట తన కుమారుడు చరణ్ ఈ టూర్ కార్యక్రమం ప్రారంభించాడని చెప్పారు. ఇందులో భాగంగా తాము భారత్ తో పాటు టొరంటో, రష్యా, శ్రీలంక, మలేసియా, సింగపూర్, దుబాయ్ ల్లో చాలా ప్రదర్శనలు ఇచ్చామని, అప్పటి వరకు తమకు ఎలాంటి నోటీసులు రాలేదని, గత వారం సియాటిల్, లాస్ ఏంజిల్స్ లో మంచి కచేరీలు ఇచ్చామని అన్నారు. అమెరికాలో కచేరీ నిర్వహిస్తుంటే ఈ నోటీసుల గొడవ మొదలైందని, ఈ నోటీసుల విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదని, చట్టాన్ని తాను గౌరవిస్తానని అన్నారు. ఈ నేపథ్యంలో ఇళయరాజా పాటలు పాడలేమని, అయితే, కచేరీలు మాత్రం జరగాల్సిందేనని అన్నారు. వాళ్లకి తాను విన్నవించుకునేది ఒకటేనని, దయచేసి, ఈ విషయాన్ని పెద్దది చేసి, తప్పుడు ప్రచారాలు చేయవద్దని.. బాలసుబ్రహ్మణ్యం ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News