: న్యాయవాదులు ఇక సమ్మె చేస్తే.. వృత్తిని వదులుకోవాల్సిందే!
సమ్మెలు, విధుల బహిష్కరణ అంటూ ఇక నుంచి న్యాయవాదులు రోడ్డు మీదికొస్తే వృత్తిని వదులుకోవాల్సి ఉంటుంది. అటువంటి వారికి భవిష్యత్తులో కోర్టులో ప్రాక్టీస్ చేసే అవకాశం లేకుండా చేయాలని ప్రతిపాదిస్తూ లా కమిషన్‌కు బార్ కౌన్సిల్ ప్రతిపాదనలు పంపింది. సమ్మెలకు దిగే న్యాయవాదులపై కఠిన చర్యల కోసం అడ్వకేట్ల చట్టానికి మార్పులు చేయాలన్న సుప్రీం ఆదేశాల నేపథ్యంలో బార్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనలు చేసింది. లా కమిషన్ కూడా ఇందుకోసం కసరత్తు చేస్తోంది.
దేశంలో మొత్తం 21 లక్షల మంది రిజిస్టర్డ్ న్యాయవాదులుండగా వారిలో 40 శాతం మంది (9 లక్షల మంది) నకిలీలని బార్ కౌన్సిల్ అంచనా. దీంతో న్యాయవాదులు నకిలీలని తేలితే మూడేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధించాలని బార్ కౌన్సిల్ తన ప్రతిపాదనలో పేర్కొంది. అలాగే తన వద్దకు వచ్చే క్లయింట్‌లకు నష్టం జరిగేలా వ్యవహరిస్తే రూ. 3 లక్షల జరిమానా, క్లయింట్‌కు రూ.5 లక్షల వరకు పరిహారం చెల్లించాలంటూ మరో ప్రతిపాదన చేసింది. ఒకవేళ క్లయింటే తప్పుడు ఆరోపణలు చేస్తే అతనికి రూ.2 లక్షల జరిమానా విధిస్తారు. బార్ కౌన్సిల్ తాజా ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జిల్లాస్థాయి న్యాయవాద సంఘాలు, ఇది ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని ఆరోపిస్తున్నాయి.