: హైటెక్ థియేటరులో 'ఖుషి' చూస్తున్నప్పుడే... నా భవిష్యత్తు తెలిసిపోయింది: పవన్ కల్యాణ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినీ కెరీర్ లో అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలిచిన 'ఖుషి' చిత్రం, ఆ సినిమా తరువాత తన కెరీర్ లో వచ్చిన మార్పు గురించి పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. గత రాత్రి జరిగిన 'కాటమరాయుడు' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ మాట్లాడుతూ, ఖుషీ సినిమా విడుదలకు ముందు రోజు హైదరాబాద్ లోని హైటెక్ థియేటరులో యూనిట్ తో కలసి సినిమా చూసిన రోజును గుర్తు చేసుకున్నారు.
"ఆ సినిమా చూస్తుండగా, ఇంటర్వెల్ లోనే నాకు అనిపించింది. వచ్చే కొన్ని సంవత్సరాలూ అత్యంత గడ్డుకాలంగా ఉంటుందని అనిపించింది. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు తప్పవన్న భావన ఏర్పడింది. మనసు కీడు శంకిస్తుండగా, నీరసం, బాధతో, ఇంటర్వెల్ నుంచే బయటకు వచ్చేశాను. ఆ రోజు నేను ఎంతో శక్తిని కోల్పోయాను. తిరిగి ఆ శక్తిని 'గబ్బర్ సింగ్' చిత్రంలో పోలీస్ స్టేషన్ సీన్ చేసిన తరువాతే పొందగలిగాను. అప్పటివరకూ నేను కోల్పోయిన శక్తిని తిరిగి ఇవ్వాలని దేవుడిని యాచిస్తూనే ఉన్నాను" అని పవన్ అన్నారు.