: పవన్ కల్యాణ్ ఊరవతల మర్రిచెట్టులాంటి వాడు!: త్రివిక్రమ్
జనమంతా ఒకడెవడో వస్తాడు అంటూ... అంతా వాడికోసం ఎదురు చూస్తారు...అలా ఎవరైనా తన గురించి మాట్లాడినప్పుడు బాధనిపిస్తుందని... అలా ప్రజల బాధలు తీర్చగలిగే స్థాయి కల్పిస్తే కనుక అంతకంటే ఇంకేమీ వద్దని పవన్ కల్యాణ్ తనతో చాలా సార్లు అన్నారని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పారు. కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ, ఒకడు చెయ్యెత్తితే జనం అంతా ఆగిపోయే శక్తి దేవుడు ఒక్కడికే ఇస్తాడు, అలాంటి శక్తి దేవుడు ఎవరికి ఇచ్చాడో అందరికీ తెలుసని అన్నారు.
పవన్ కల్యాణ్ గురించి చెప్పమంటే... ఊరవతల మర్రి చెట్టులాంటివాడని అంటానని త్రివిక్రమ్ అన్నారు. 'ఎందుకంటే, ఊరవతల ఏపుగా పెరిగిన మర్రిచెట్టు ఎండనుంచి, వర్షం నుంచి కాపాడుతుంది.. కనీసం గుర్తింపు కూడా కోరుకోదు.. అదే పవన్ కల్యాణ్' అంటూ త్రివిక్రమ్ విడమరచి చెప్పారు. పవన్ కల్యాణ్ చేసిన మంచిపనులకు తాను ప్రత్యక్ష సాక్షినని ఆయన చెప్పారు. అంతా కలిపి ఇంతే కావచ్చు... కానీ ఒకసారి తలెత్తి చూస్తే ఒక దేశం జెండాకున్న పొగరంత... ఆయన గొంతెత్తితే కొన్ని కోట్ల గొంతుల శబ్దం.. ఆయన సాయం కొన్ని కోట్ల చేతుల సాయం... ఆయన సేవ, మంచితనం ఇలాగే మరింత ముందుకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.