: పవన్ తో పని చేయాలన్న దాహం ఇప్పట్లో తీరేలా లేదు: దర్శకుడు కిశోర్ పార్థసాని
'టీజర్ కట్ చేస్తుంటే పెద్దగా అనిపించలేదు కానీ, అభిమానుల మధ్య దానిని చూస్తుంటే ఈ సినిమా నేనే తీశానా? అనిపించిందని' కాటమరాయుడు దర్శకుడు కిశోర్ పార్థసాని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ, 'గోపాల గోపాల' సినిమా తీసినప్పుడు పవన్ కల్యాణ్ తో ఇన్ని రోజులే పని చేశానా? అనిపించిందని, మరికొన్ని రోజులు పని చేస్తే బాగుంటుందని అనిపించిందని ఆయన చెప్పారు. అయితే అప్పుడు మరో సినిమా డాలీతో చేస్తానని ఆయన మాట ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం వెంటనే సినిమాను తనతో చేశారని, అందుకు ఆయనకు ధన్యవాదాలని ఆయన చెప్పారు.
పవన్ కల్యాణ్ తో సినిమాలు చేస్తుంటే ఇంకా ఇంకా చేయాలనిపిస్తుందని ఆయన అన్నారు. పవన్ తో పని చేయాలన్న దాహం ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదని ఆయన తెలిపారు. మళ్లీ మళ్లీ ఆయనతో పని చేయాలని ఆకాంక్షిస్తున్నానని ఆయన తెలిపారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ గారితో పని చేయడమే గొప్ప అయితే... ఆయనతో మళ్లీ మళ్లీ పని చేయడం గ్రేట్ అని, ఆ గ్రేట్ అనుభవం తనకు వచ్చిందని ఆయన తెలిపారు.