: పవన్ కల్యాణ్ ను బాగా ఇష్టపడుతున్న వ్యక్తుల్లో నేనూ ఒకడిని: 'టీవీ9' రవి ప్రకాశ్


 ఈ మధ్య కాలంలో పవన్ కల్యాణ్ ను బాగా ఇష్టపడుతున్న వ్యక్తుల్లో తాను కూడా ఒకడినని ప్రముఖ న్యూస్ ఛానెల్ టీవీ9 సీఈఓ రవి ప్రకాశ్ తెలిపారు. హైదరాబాదులోని శిల్పకళావేదికలో నిర్వహించిన కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ, మొన్నటి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ లా మరొక వ్యక్తి ఎవరైనా కీలక పాత్ర పోషించి ఉంటే... ఫలితాల అనంతరం దానిని మరొక సంపాదనకు అవకాశంగా తీసుకుని ఉండేవారని అన్నారు. అలా ఇతరుల్లా పవన్ కల్యాణ్ కు అవకాశం ఉన్నప్పటికీ అలాంటి సంపాదనా మార్గంగా ఆ అవకాశాన్ని మలచుకోకుండా... ఇచ్చిన మాటకు కట్టుబడి, విమర్శలు ఎదురవుతున్నా ప్రజల పక్షాన నిలబడ్డ వ్యక్తి పవన్ కల్యాణ్ అని ప్రశంసించారు. రాజకీయాల్లో సరికొత్త విధానాలకు పవన్ కల్యాణ్ నాంది పలికారని ఆయన చెప్పారు.

 ఈ రోజుల్లో నిజం మాట్లాడడం, సత్యం వెనుక నిలబడడం చాలా కష్టమైన విషయమని ఆయన చెప్పారు. అలాంటిది పవన్ కల్యాణ్ భయపడకుండా.. మీడియా కూడా మాట్లాడేందుకు ఇబ్బంది పడే.. ఏపీకి ప్రత్యేక హోదా, నోట్ల రద్దు వంటి విషయాలపై నిర్భయంగా స్పందించడం ఎవరికైనా ఆదర్శనీయమని అన్నారు. యువత ఆయనలా నిజమైన సమస్యలపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఎన్నికల ముందొక మాట, తరువాత ఒకమాట మాట్లాడే ఈ పరిస్థితి మారాలంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించిన విధానం బాగుందని, ఆయనకు అభినందనలని ఆయన చెప్పారు. పవన్ కల్యాణ్ ఈ ప్రయత్నంలో విజయం సాధించి, ప్రజా సమస్యలను దూరం చేయాలని ఆయన ఆకాంక్షించారు. 

  • Loading...

More Telugu News