: నేను చెప్పినా ప్రభాస్ వినిపించుకోలేదు... అంత గొప్ప కమిట్ మెంట్ ఉన్న నటుడు తను!: రాజమౌళి
'బాహుబలి' సినిమాలో 'వీరేంద్ర బాహుబలి' డెడికేషన్, కమిట్ మెంట్ ను ఆ సినిమా దర్శకుడు రాజమౌళి అభినందించాడు. బాలీవుడ్ క్రిటిక్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రాజమౌళి...'బాహుబలి' పూర్తయ్యేంత వరకు ప్రభాస్ ఎంతో నమ్మకంతో మరే సినిమా చేయకుండా ఉండిపోయాడని తెలిపాడు. 'బాహుబలి: ద బిగినింగ్' నుంచి 'బాహుబలి 2: ది కన్ క్లూజన్' సినిమా షూటింగ్ కు మధ్య 8 నుంచి 9 నెలల గ్యాప్ వచ్చిందని గుర్తు చేశాడు. ఈ సమయంలో ఓ సినిమా షూటింగ్ పూర్తి చేయొచ్చని, ఓ సినిమా చేసెయ్యమని చెప్పానని ఆయన అన్నారు.
ప్రభాస్ కూడా అందుకు మొదట్లో సుముఖంగా ఉన్నాడని అన్నాడు. అయితే, ఆ తరువాత మాత్రం 'బాహుబలి 2: ది కన్ క్లూజన్' పూర్తయిన తరువాతే ఇంకో సినిమా ఒప్పుకుంటానని చెప్పాడని తెలిపాడు. అంతర్జాతీయ క్రేజ్ సంపాదించుకున్న ఏ నటుడైనా తన క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనుకుంటాడని, అయితే ప్రభాస్ వాటికి విభిన్నమని అన్నాడు. ప్రభాస్ లో డెడికేషన్, కమిట్ మెంట్ కు తాను ఫిదా అయిపోయానని చెప్పాడు. ప్రభాస్ కమిట్ మెంట్ తనను చాలా ఇన్ స్పైర్ చేసిందని రాజమౌళి తెలిపాడు.