: నేను హైదరాబాద్‌లోనే ఏసీ గదుల్లో ఉండి పాలన కొనసాగించవచ్చు.. కానీ అలా చేయలేదు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని గోళ్లపాడులో సేఫ్ ఫార్మా కంపెనీ రెండో బ్లాక్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తాను హైదరాబాద్‌లోనే ఏసీ గదుల్లో ఉండి పాలన కొనసాగించవచ్చని.. కానీ అలా చేయలేదని అన్నారు. పాలన సొంత గడ్డపై నుంచి జరిగితేనే బాగుంటుందని అమరాతికి వచ్చేశామని అన్నారు. 14వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలు లేవని చెబుతోందని ఆయన అన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ సాయంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నామని చెప్పారు. అయితే, కొందరు మాత్రం ప్రత్యేక హోదాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు ఇంకా ఎక్కువగా వస్తాయని అంటున్నారని ఆయన అన్నారు.
విభజన తరువాత ఎన్ని సమస్యలు ఉన్నా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని పథకాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళుతున్నామని చెప్పారు. సంక్రాంతి, క్రిస్మస్ కానుకలు కూడా అందిస్తున్నామని అన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం దూసుకుపోతుందని ఆయన చెప్పారు.