: ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చంటూ సుబ్రహ్మణ్య స్వామే చెప్పారు.. విచారణ జరపాలి: మమతా బెనర్జీ
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఆ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన బీఎస్పీ, ఆమ్ ఆద్మీ నేతలు మాయావతి, అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారంటూ ఆరోపణలు గుప్పించారు. దీని పట్ల స్పందించిన కేంద్ర ఎన్నికల కమిషన్ అటువంటివి జరిగే అవకాశం లేదని స్పష్టం చేసినప్పటికీ తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అవే ఆరోపణలు చేశారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం అన్ని పార్టీలతో అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చంటూ ఇటీవల భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్న ఓ వీడియోక్లిప్ గురించి ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రస్తావించారు. ఈవీఎం ట్యాంపరింగ్ల అంశం తాను చెప్పింది కాదని, చట్టబద్ధంగా ప్రసిద్ధుడైన సుబ్రహ్మణ్యస్వామి చెప్పారని ఆమె ఉద్ఘాటించారు. సుబ్రహ్మణ్య స్వామి చెప్పిన విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ అంశంపై విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.