: రవితేజ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణాన్ని వివరించిన లావణ్య త్రిపాఠి!
'అందాల రాక్షసి'గా ప్రేక్షకుల చేత పిలిపించుకుని, 'సోగ్గాడే చిన్ని నాయనా'లో ఏకంగా నాగార్జునకు జోడీగా నటించిన లావణ్య త్రిపాఠికి టాలీవుడ్ లో గుడ్ గర్ల్ ఇమేజ్ ఉంది. పద్ధతైన పాత్రల్లోనే నటిస్తూ వచ్చిన లావణ్య... ఇంతవరకు సిల్వర్ స్క్రీన్ మీద గ్లామర్ ను ఒలకబోయలేదు. తన వయసున్న హీరోయిన్లంతా మోడ్రన్ గా కనిపిస్తూ తెరపై తళుక్కుమంటుంటే... లావణ్య మాత్రం సంప్రదాయబద్ధంగానే కనిపిస్తోంది. అయితే, ఈ ఇమేజ్ తనకు వద్దంటోంది ఈ భామ. ఈ గుడ్ గర్ల్ ఇమేజ్ తో తనకు విసుగు వచ్చేసిందని... ఒక్క అవకాశం ఇస్తే, గ్లామర్ పాత్రలో మురిపిస్తానని చెబుతోంది. వాస్తవానికి తనకు మోడ్రన్ గా ఉండటమే ఇష్టమని చెప్పింది.
మరోవైపు, రవితేజ పక్కన నటించే అవకాశాన్ని లావణ్య వదులుకోవడం ఫిలిం నగర్ లో చర్చనీయాంశం అయింది. దీనిపై ఆమె స్పందిస్తూ, రవితేజ కన్నా ముందే నాగ చైతన్య సినిమాను తాను ఒప్పుకున్నానని... దీంతో, రవితేజ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమని భావించానని చెప్పింది. సినిమాను ఒప్పుకుని వారిని ఇబ్బంది పెట్టడం కన్నా, ముందే తప్పుకోవడం మేలనే ఆలోచనతోనే... ఆ సినిమా నుంచి తప్పుకున్నానని తెలిపింది. భవిష్యత్తులో రవితేజతో సినిమా చేసే అవకాశం వస్తుందన్న నమ్మకం ఉందని చెప్పింది.