: అజిత్ తో రాజకీయ చిత్రం.. విజయ్ తో హాలీవుడ్ సినిమా ప్లాన్ చేస్తున్న దర్శకుడు!
తమిళ స్టార్లు విజయ్, అజిత్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాస్ ఫాలోయింగ్ దండిగా ఉన్న వీరిద్దరికీ తెలుగు రాష్ట్రాలతోపాటు కేరళలోనూ అభిమానులున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరిలో ఒకరితో రాజకీయ చిత్రం, మరొకరితో హాలీవుడ్ చిత్రం చేసేందుకు ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు రాజ్ తిరుసెల్వన్ విశ్వప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రవాస భారతీయుడైన తిరుసెల్వన్ తాజాగా ‘లేక్ ఆష్ ఫైర్’ అనే హాలీవుడ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తిరుసెల్వన్ మాట్లాడుతూ తాను రెండు కథలను తయారుచేశానని, అందులో ఒకటి తమిళ రాజకీయాల గురించి అని తెలిపారు.
రాష్ట్రంలో రెండు పార్టీలే మార్చిమార్చి అధికారంలోకి ఎందుకు వస్తున్నాయి? దానికి కారణం ఏమిటి? వీటి వెనక ఉన్నదెవరు? తదితర వాస్తవాలతో అజిత్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు పేర్కొన్నారు. ఇందుకోసం చర్చలు జరుగుతున్నాయన్నారు. అలాగే ఓ పూర్తి ప్రేమ కథను సిద్ధం చేసినట్టు తిరుసెల్వన్ తెలిపారు. ఇందులో విజయ్ నటిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కోలీవుడ్‌లో విజయ్ చాలా సాధించాడని, హాలీవుడ్‌లో అరంగేట్రానికి ఈ చిత్రం దోహద పడుతుందని రాజ్ తిరు సెల్వన్ పేర్కొన్నారు. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్న వీరిద్దరూ రాజ్ తిరుసెల్వన్ ప్రతిపాదనకు అంగీకరిస్తారా.. అన్న విషయం తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.