: కమలహాసన్ తో బాగా క్లోజ్ గా ఉండేవాడిని!: సీనియర్ నటుడు మిశ్రో
ప్రముఖ నటుడు కమల హాసన్ తో తాను బాగా క్లోజ్ గా ఉండేవాడినని సీనియర్ నటుడు మిశ్రో అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘చిన్నా చితకా అన్ని సినిమాలు కలిపి యాభై సినిమాల్లో నటించాను. నాకు గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేరు. కానీ, నాకు అనుకోకుండా అవకాశాలు వచ్చాయి. థియేటర్ ఆర్ట్స్ చేస్తుండగా.. దర్శకుడు బీవీ ప్రసాద్, ప్రొడ్యూసర్ గంగాధర్ రావు గారు తీసిన ‘నీడ లేని ఆడది’ సినిమాలో నాకు మొట్టమొదటి అవకాశం లభించింది. నాకు కొంచెం గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత చాలా అవకాశాలు వాటంతట అవే వచ్చాయి.
నేను కోర్టులో ఉద్యోగం చేసే వాడిని. సెలవులు దొరకకపోవడంతో కొన్ని సినిమాల్లో నటించలేకపోయాను. అయితే, అప్పుడప్పుడు బోల్డన్ని అబద్ధాలు ఆడి, అంటే మా అమ్మ చనిపోయిందని, మా అంకుల్ చనిపోయారని .. ఇలా.. అబద్దాల ద్వారా చాలా మందిని చంపేసి సెలవులు సంపాదించేవాడిని. మన తెలుగు ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ ల దగ్గర నుంచి డైరెక్టర్ల వరకు చాలా అద్భుతమైన టాలెంట్ కనిపిస్తుంది. కానీ, దానిని సరైన పద్ధతిలో వాడుకోలేదనిపిస్తుంది.
అసలు విశ్వనాథ్ గారు, బాలచందర్ గారు, బాపు గారు గానీ లేకపోతే సినిమా అన్నది అంధకార యుగంగా ఉండేదేమో!.. బాలచందర్ గారి వద్ద నేను మూడు సినిమాలకు పనిచేశాను. వేషాలు వేస్తూ.. అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశాను. బాలచందర్ గారు అందరినీ ఫ్రెండ్ గా చూసుకుంటారు... అందుకని, ఆయన వద్ద పని చేసేటప్పుడు టెన్షన్ ఉండదు. విశ్వనాథ్ గారి దగ్గర అయితే, ఆయన చేతిలో బెత్తం లేకపోయినా ఉన్నట్టే అనిపిస్తుంది. అయితే, విశ్వనాథ్ గారు యాక్టు చేయమని చెప్పిన దాంట్లో ముప్ఫై ఐదు శాతం చేస్తేనే మాకు ఇంత పేరు వచ్చింది. ఒకవేళ, ఆయన చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో నటిస్తే ఇంకెంత పేరు వచ్చేదో అనిపిస్తుంది.
ఇక బాపు గారి గురించి చెప్పాలంటే .. ఆయనో పిచ్చి పుల్లయ్యలా ఉంటారు. కానీ, ఎంత మేధావో !.. ‘ఇంకొంచెం చేయకూడదు.. ఆ.. బాగుంది’... అనడం తప్ప, అంతకు మించి బాపుగారూ ఎక్కువగా చెప్పడం నాకు తెలియదు. బాలచందర్ గారు అయితే, ‘ఎన్నప్పా, వండర్ ఫుల్ .. కమాన్.. డూ ఇట్..డూ ఇట్’ అంటారు. విశ్వనాథ్ గారు అయితే.. ‘ఊ.. ఏంటదీ..ఆ.. ఓకే.. ఓకే..డూ ఇట్..కమాన్’ అంటూ ఓ మాస్టరు గారు స్టూడెంట్ ను తయారు చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ దర్శకులతో పని చేయడం నా అదృష్టం. కమల్ తో బాగా క్లోజ్ గా ఉండే వాడిని. మిగిలిన నటులతో బాగానే ఉన్నాను గానీ.. అంటీముంటనట్టుగా ఉన్నాను.
నేను ఏ సినిమాలో నటిస్తున్నా.. ఇదే నా చివరి సినిమా అనే భావన ఉండేది. ఇది శాశ్వతం.. కంటిన్యూ అవుతాననే భావన ఉండేది కాదు. ‘సాగర సంగమం’ చిత్రంలో నా నటనకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి... సిరివెన్నెల చిత్రంలో నేను నటించిన తాత గారి వేషం నాకు బాగా నచ్చింది. విశ్వనాథ్ నాన్నగారిని దృష్టిలో పెట్టుకుని ఈ పాత్రను సృష్టించారట. ఈ విషయం నాకు ఎవరో చెప్పారు. తీరిక సమయాల్లో నాటకాలు వేస్తూ ఉండటం తప్పా, నాకు వేరే వ్యాపకం ఏదీ లేదు’ అని మిశ్రో చెప్పారు.