: విమానంలో ఘర్షణలకు హైదరాబాదీలు దూరం...! ఉత్తరాది వారు మాత్రం రెడీ...!
విమాన ప్రయాణంలో పక్కనున్న వారు మీ పట్ల అసభ్యంగా వ్యవహరిస్తే ఏం చేస్తారు...? లాగి ఒక్కటిచ్చుకుంటామంటారా...? కానీ, ఈ విషయంలో మాత్రం హైదరాబాదీలు, దక్షిణాది వారిది కాస్త వెనుకంజే. ఘర్షణలకు వీరు దూరం. అంతర్జాతీయ ఆన్ లైన్ ట్రావెల్ కంపెనీ ఎక్స్ పీడియా నిర్వహించిన తాజా సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
విమానంలో అసభ్యంగా ప్రవర్తిస్తే ఎలా స్పందిస్తారు...? అన్న ప్రశ్నకు తాము ప్రతిఘటిస్తామని దక్షిణాది ప్రాంతంలో కేవలం 29 శాతమే చెప్పారు. అదే ఉత్తరాది ప్రాంతానికి చెందిన వారిలో 83 శాతం మంది, పశ్చిమ భారతంలోని పట్టణాలకు చెందిన వారిలో 77 శాతం మంది అసభ్యంగా ప్రవర్తించిన వారితో తలపడతామని చెప్పడం విశేషం. అంతేకాదు, దక్షిణాది వారు విమానాల్లో ప్రయాణిస్తున్న సమయంలో పక్కనున్న వారితో సంభాషించేందుకూ ఆసక్తి చూపరని తెలిసినట్టు ఈ సంస్థ వెల్లడించింది. హైదరాబాద్ ప్రయాణికులు, ముఖ్యంగా దక్షిణాది వారు మద్యం సేవించిన, శబ్దం చేసే వారి పట్ల సహనంతో ఉంటారని ఎక్స్ పీడియా మార్కెటింగ్ విభాగం అధిపతి మన్మీత్ అహ్లువాలియా తెలిపారు. ఇక దక్షిణాది విమాన ప్రయాణికుల్లో 23 శాతం మంది సీటులో కూర్చోవడం ఆలస్యం వెనుకనున్నది గర్భిణులా, వృద్ధులా అన్నది కూడా చూసుకోకుండా సీటును వెనక్కి వాల్చేస్తారని ఈ సర్వేలో వెల్లడైంది.