: ఆరెస్సెస్ కు మద్దతు పలికిన 10 లక్షలకు పైగా ముస్లింలు!
ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ముస్లింలు అత్యధికంగా ఉండే నియోజకవర్గాల్లో సైతం బీజేపీ విజయబావుటా ఎగురవేయడం పట్ల ముస్లిం నేతలు, పెద్దలు షాక్ అయ్యారు. ఇలా ఎందుకు జరిగిందో కనుక్కునే ప్రయత్నంలో వారున్నారు. ఇప్పుడిప్పుడే అసలైన విషయం వెలుగులోకి వస్తోంది. బీజేపీకి వెన్నెముక అయిన ఆర్ఎస్ఎస్ దీనికి కారణమని తెలుస్తోంది. ముస్లిం మహిళల పాలిట శాపంగా పరిణమించిన ట్రిపుల్ తలాక్ ను వ్యతిరేకిస్తూ ఆరెస్సెస్ ముస్లిం విభాగం అయిన ముస్లిం రాష్ట్రీయ మంచ్ (ఎంఆర్ఎం) సంతకాల సేకరణ చేపట్టింది. దీనికి ఆ వర్గం నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఎంఆర్ఎం పిటిషన్ పై ఏకంగా 10 లక్షలకు పైగా ముస్లింలు సంతకాలు చేశారు. వీరిలో అత్యధికులు మహిళలు కావడం గమనార్హం.
ముస్లిం మతంలో అతిపెద్ద సమస్య ట్రిపుల్ తలాక్ అని... దీనిపై పూర్తి స్థాయిలో చర్చించి, పరిష్కారాన్ని కనుగొనాలని ఎంఆర్ఎం పిలుపునిచ్చింది. తలాక్ వల్ల నష్టపోయిన వారు, సంబంధం ఉన్నవారు. ప్రభుత్వ ప్రతినిధులు అందరూ దీనిపై చర్చించాలని తెలిపింది. ఈ నేపథ్యంలోనే, లక్షలాది మంది ముస్లింలు ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా ఏకమయ్యారు. ఈ అంశమే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయాన్ని సాధించిపెట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు.