: తమిళనాడులో మరో కొత్త సంప్రదాయం మొదలు.. ‘బడ్జెట్’ సూట్‌కేసును జయ సమాధిపై పెట్టిన ఆర్థికమంత్రి
తమిళనాడులో మరో కొత్త సంప్రదాయం పురుడుపోసుకుంది. గురువారం ఉదయం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థికమంత్రి డి.జయకుమార్ ముఖ్యమంత్రి పళనిస్వామితో కలిసి నేరుగా మెరీనా బీచ్‌కు వెళ్లి జయలలిత సమాధిపై బడ్జెట్ సూట్‌కేసు పెట్టి అంజలి ఘటించారు. అనంతరం అక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
జయలలిత సమాధిపై బడ్జెట్ సూట్‌కేసు పెట్టడం సభా నియమాల ఉల్లంఘనే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది ముమ్మాటికి రాజ్యంగ విరుద్ధమేనని, ఆర్థిక మంత్రిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డీఎంకే నేత స్టాలిన్ డిమాండ్ చేశారు. బడ్జెట్ సూట్‌కేసును జయ సమాధిపై పెట్టి జయకుమార్ అసెంబ్లీకే కళంకం తెచ్చారని ఆరోపించారు. శాసనసభ నిబంధనలను మంత్రి తుంగలో తొక్కారని మండిపడ్డారు. మంత్రి జయకుమార్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని సీపీఐ, సీపీఎం కూడా డిమాండ్ చేస్తున్నాయి.