: అద్భుత దృశ్యం.. ట్రైన్ వచ్చింది.. మంచు ఎగసిపడింది!
అమెరికాలోని పలు రాష్ట్రాలను మంచు తుపాను ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. దీని ధాటికి రోడ్డు, రైలు మార్గాలన్నీ మంచుతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్ లోని ఓ రైల్వే స్టేషన్ లో భారీగా కురిసిన మంచుతో ట్రాక్ కప్పిపోయింది. ట్రైన్ వస్తుందని ప్రకటించడంతో రైల్వే స్టేషన్ లోని ప్రయాణికులంతా రైలు రావడాన్ని ఆసక్తిగా తిలకించారు. మంచును చీల్చుకుంటూ వస్తున్న ట్రైన్ అద్భుతంగా కనిపిస్తోంది. దీనిని మైమరిచి అంతా ఆసక్తిగా ఆ కనులకింపైన సీన్ ను చూస్తున్నారు. యువకులు దీనిని వీడియో తీసుకుంటున్నారు.
ఇంతలో అందర్నీ షాక్ కు గురి చేస్తూ ట్రైన్ ఫ్లాట్ ఫాం చేరడానికి ముందే.. రైలు పట్టాలపై పరుచుకున్న దట్టమైన మంచును రైలు చెల్లాచెదురు చేసింది. ఈ మంచులో కొంత భాగం అక్కడి ప్రయాణికులపైకి ఎగచిమ్మింది. దీంతో వారంతా మంచులో తడిసి ముద్దయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా, నెటిజన్లు దీనిని ఆసక్తిగా చూస్తున్నారు.