: అసెంబ్లీలో బల్లగుద్ది సవాలు విసిరిన మంత్రి దేవినేని ఉమ!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి చేసిన విమర్శలపై మంత్రి దేవినేని ఉమా మహేశ్వరావు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పనులు రాజశేఖర్ రెడ్డి, జగన్ వల్లే ఆలస్యం అయ్యాయని అన్నారు. జగన్మోహన్‌రెడ్డి ఉత్తరకుమారుడిలా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. గతంలో అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పారని, అదే సమయంలో తమ నాయకుడు చంద్రబాబు ఓ సవాలు విసిరారని అన్నారు.
పోలవరం ప్రాజెక్టుని ఐదేళ్లలో పూర్తి చేస్తే ఈ అసెంబ్లీలో వైఎస్‌కి సన్మానం చేస్తానని సవాలు చేశారని అన్నారు. అనంతరం వెయ్యి కోట్ల రూపాయలు, పవర్ ప్రాజెక్టు కొట్టేయాలన్న ఉద్దేశంతో పనులు చేశారని అన్నారు. ప్రాజెక్టు పూర్తికాకుండానే పోయిందని అన్నారు. ఈ సందర్భంగా దేవినేని తాము పోలవరం ప్రాజెక్టుని 2019 నాటికి పూర్తి చేసి చూపిస్తామని రెండు, మూడు సార్లు బల్లగుద్ది చెప్పారు. 'చేసి చూపిస్తా.. చేసి చూపిస్తా' అని ఆయన గట్టిగా అన్నారు. పోలవరం పూర్తయితే వైఎస్సార్ పార్టీకి పుట్టగతులు ఉండవని భయపడుతోందని ఆయన విమర్శించారు.