: తమిళనాడు శాసనసభలో శశికళ ప్రస్తావన తెచ్చిన ఆర్ధిక మంత్రి... విరుచుకుపడ్డ స్టాలిన్!


పళనిస్వామి ప్రభుత్వం తొలిసారి అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి జయకుమార్ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ పేరును సభలో ప్రస్తావించారు. శశికళ పేరును సభలో ప్రస్తావించడంపై డీఎంకే మండిపడింది. ఆర్థికమంత్రి తీరును తప్పుబడుతూ సభలో డీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు. రికార్డుల నుంచి శశికళ పేరును తొలగించాలని డీఎంకే సభ్యులు పట్టుబట్టారు. అయితే, రికార్డుల నుంచి తొలగించడానికి స్పీకర్ ధనపాల్ అంగీకరించలేదు. దీంతో, స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూడా డీఎంకే యత్నించింది. ఆ తర్వాత ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.

బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్థికమంత్రి ప్రారంభిస్తూ తొలుత దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నివాళి అర్పించారు. అనంతరం గౌరవనీయులైన చిన్నమ్మ అంటూ శశికళ పేరును ప్రస్తావించారు. దీంతో, వెంటనే ప్రతిపక్ష నేత స్టాలిన్ తన సీటులో నుంచి లేచి నిలబడి అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్రమాస్తుల కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న వ్యక్తి పేరును సభలో ఎలా ప్రస్తావిస్తారంటూ స్టాలిన్ నిలదీశారు. అయితే, తమ పార్టీ నాయకురాలి పేరును ప్రస్తావించడంలో తప్పేముందని ఆర్థిక మంత్రి అన్నారు. ఆ తర్వాత కాసేపు సభలో గందరగోళం నెలకొంది. అనంతరం బడ్జెట్ ప్రసంగం కొనసాగింది.

  • Loading...

More Telugu News