: ప్రేమించడం లేదన్న కోపంతో మరదలి గొంతుకోసి హత్య.. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్న యువకుడు!
తనను ప్రేమించడం లేదన్న కోపంతో ఓ యువకుడు తన మరదలి గొంతుకోసి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు వివరాలు తెలిపారు. గాండ్ల ఓదెలు, విజయ దంపతులకి ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఇద్దరమ్మాయిలకు పెళ్లిళ్లు అయిపోయాయి. చివరి అమ్మాయి సంధ్యారాణి(19) డిగ్రీ చదువుతోంది. ఓదెలు సోదరి కుమారుడైన గణేష్(22) అనే యువకుడు సంధ్యారాణిని కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. తన మేనమామ ఇంట్లోనే ఉంటున్న గణేష్... నిన్న రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సంధ్యతో వాగ్వివాదానికి దిగాడు.
ఆమె మరో మేనబావను ప్రేమిస్తున్నట్లుగా గణేష్ అనుమానించాడు. వాగ్వివాదం మరింత పెరగడంతో గణేష్ ఒక్కసారిగా కోపంతో ఊగిపోయి ఇంట్లో ఉన్న కత్తితో ఆమె గొంతు కోసి చంపేశాడు. తరువాత తానూ కోసుకొన్నాడు. అయితే, ఆ ఇంట్లో నుంచి అరుపులు రావడంతో గాయాలతోనే గణేష్ పారిపోయి... పక్కనే ఉన్న రెండంతస్తుల భవనంపై ఎక్కి, అక్కడి నుంచి 11 కేవీ విద్యుత్తు తీగలపైకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.