: పాకిస్థాన్ మరో దుందుడుకు చర్య.. భారత్‌లో అంతర్భాగమైన గిల్గిత్-బాల్టిస్థాన్‌ను ఐదో ప్రావిన్స్‌గా ప్రకటించే యోచన
దాయాది పాకిస్థాన్ మరోమారు భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. భారత్‌లో అంతర్భాగమైన ‘గిల్గిత్-బాల్టిస్థాన్’ను తమ ఐదో ప్రావిన్స్‌గా ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించి మరోమారు ఉద్రిక్తతలకు తెరలేపింది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)ను ఆనుకుని ఉన్న ఈ ప్రాంతం భారత్ సొంతం. ఈ విషయాన్ని భారత్ పలుమార్లు పేర్కొంది. భారతదేశ పటంలో ఈ భాగం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కశ్మీర్ ఇరు దేశాల మధ్య అతిపెద్ద సమస్యగా మారడంతో గిల్గిత్-బాల్టిస్థాన్ అంశానికి ఇప్పటి వరకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. ప్రస్తుతం పాక్ చెరలో ఉన్న ఈ ప్రాంతం మొత్తం వైశాల్యం 85,793 చదరపు కిలోమీటర్లు. దీనిని ప్రత్యేక భౌగోళిక పరిధి ప్రాంతంగా పాక్ గుర్తిస్తోంది. ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి కూడా ఉన్నారు.