: అవకాశమిస్తానని నమ్మించి రేప్ చేశాడు.... 'చెన్నై ఎక్స్ ప్రెస్' నిర్మాతపై హైదరాబాదులో ఓ యువతి కేసు
షారూఖ్ ఖాన్, దీపికా పదుకునే జంటగా నటించిన 'చెన్నై ఎక్స్ ప్రెస్' సినిమా నిర్మాత కరీం మొరానీపై ఢిల్లీకి చెందిన యువతి హైదరాబాదులోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి తనను రేప్ చేశాడని ఆమె ఫిర్యాదు ఇచ్చింది. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. కరీం మొరానీ తనను సినిమాలో అవకాశం ఉందంటూ పిలవడంతో 2015లో తాను ఢిల్లీ నుంచి ముంబై వచ్చానని తెలిపింది.
సదరు నిర్మాత తన స్నేహితురాలి తండ్రి కావడంతో సినిమాలో అవకాశం నిజంగానే ఇస్తాడని భావించానని ఆమె చెప్పింది. ముంబై వచ్చిన అనంతరం హోటల్ లో ఉండగా మధ్యాహ్నం ఫోన్ చేసిన కరీం మొరానీ భోజనం చేద్దామని పిలిచాడని తెలిపింది. హోటల్ లో భోజనం బాగానే ఉందని తాను చెప్పడంతో, ఆ సాయంత్రం వైన్ బాటిల్ పట్టుకుని 5:30 నిమిషాలకు వచ్చాడని, సినీ పరిశ్రమలో పార్టీలు సహజమని, తాగాలని బలవంతం చేయడంతో తాను కూడా తాగక తప్పలేదని తెలిపింది. అందులో ఏం కలిపాడో తెలియదని, అయితే తాను మగతలోకి జారుకున్నానని, ఆ తరువాత లేచి చూస్తే కరీం మొరానీ కనిపించలేదని, తన ఒళ్లంతా నొప్పులు వచ్చాయని, పొత్తికడుపులో విపరీతమైన నొప్పితో బాధపడుతూ అతనికి ఫోన్ చేశానని తెలిపింది.
అయితే ముందు తానేమీ చేయలేదని చెప్పిన కరీమ్ మొరానీ...తన పరిస్థితి వివరించడంతో వెకిలిగా నవ్వుతూ తన అశ్లీల ఫోటోలు పంపాడని చెప్పింది. దీంతో తాను షాక్ తిన్నానని తెలిపింది. కరీమ్ మొరానీ బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కు సన్నిహితుడని, అండర్ వరల్డ్ తో సంబంధాలు ఉన్నాయని, తనొక గ్యాంగ్ స్టర్ అని, 2జీ స్కాంతో సంబంధం కలిగిన వ్యక్తి అని, ఇప్పుడు తనను చంపుతానని బెదిరిస్తున్నాడని, తనకు రక్షణ కావాలని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొంది.