: కొన్ని గ్రామాలను తిరిగి ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించారు: కేసీఆర్


పోలవరం ముంపు గ్రామాలకు సంబంధించి తెలంగాణ శాసనమండలిలో ఆసక్తికర చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఏపీలోకి వెళ్లిన గ్రామాల్లో... నాలుగు గ్రామాలను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని... ఆ గ్రామాలతో ఏపీకి పని లేదని... అవసరమైతే ఈ విషయంలో ప్రభుత్వంతో కలసి వచ్చేందుకు తాము కూడా సిద్ధమని కేసీఆర్ ను ఉద్దేశించి మాట్లాడారు.

దీనికి సమాధానంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఈ విషయం గురించి తాను ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడానని... అమరావతికి వెళ్లినప్పుడు కూడా ఈ విషయాన్ని చంద్రబాబుతో చర్చించానని చెప్పారు. ఆర్డినెన్స్ ద్వారా ఏపీలోకి వచ్చిన కొన్ని గ్రామాలు వాస్తవానికి ముంపు గ్రామాలు కావని... ఆ గ్రామాలు తెలంగాణలో ఉండటం వల్ల ఏపీకి ఎలాంటి నష్టం లేదని చంద్రబాబుకు తాను చెప్పానని అన్నారు.

అవసరం లేని గ్రామాలను కూడా ఆర్డినెన్స్ ద్వారా తీసుకోవడం మంచిది కాదని... కొన్ని గ్రామాలను వెనక్కి తిరిగి ఇవ్వాలని చంద్రబాబును తాను కోరగా... దానికి ఆయన కూడా అంగీకరించారని చెప్పారు. అవసరమైతే మనమిద్దరం కలసి కేంద్ర ప్రభుత్వానికి చెబుదామని చంద్రబాబు తనతో అన్నారని తెలిపారు. మొత్తం మీద ఆరేడు గ్రామాలు తెలంగాణకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News