: వైద్యుల సలహా లేకుండా ఆ పెయిన్ కిల్లర్స్ వాడేస్తున్నారా? అయితే ముప్పే.. పరిశోధనలో వెల్లడి
గాయాలు తగిలినప్పుడు ఏర్పడే నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి భారత్‌తో పాటు ఎన్నో దేశాల్లో ఇబూప్రోఫెన్ (లేదా బ్రూఫిన్)ను చాలా మంది ఉపయోగిస్తుంటారు. అయితే, ఇష్టం వచ్చినట్లు బ్రూఫిన్ను తీసుకుంటే కార్డియాక్ అరెస్టు ముప్పు పెరుగుతుందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. వైద్యుల సలహా కూడా తీసుకోకుండా, ఎంతో మంది తమంతట తాము ఈ మందులను కొనుక్కుని వాడుతున్నారని, అటువంటి వారిలో కార్డియాక్ అరెస్టు ముప్పు 31 శాతం అధికమని డెన్మార్క్ పరిశోధకులు తెలిపారు. డెన్మార్క్‌లో 2001 నుంచి 2010 వరకు కార్డియాక్ అరెస్టుతో బాధపడిన సుమారు 29వేల మంది రోగులను పరిశీలించి ఈ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుగొన్నారు.
కేవలం ఇబూప్రోఫెన్ మాత్రమే కాకుండా డైక్లోఫెనాక్ వల్ల కూడా ఇదే తరహా ముప్పు 50 శాతం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అసలు ఇటువంటి నొప్పి నివారణ మందుల అమ్మకాలను నియంత్రించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని తీసుకుంటే ప్రజారోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని అన్నారు. అయితే, నొప్పి నివారణ మందులన్నీ ప్రమాదకరం కాదని అధికంగా వాడుతున్న ఇబూప్రోఫెన్, డైక్లోఫెనాక్‌ల వల్లే ఈ ముప్పు అధికంగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు ఇటువంటి మందులను సొంతంగా వాడకూడదని చెప్పారు.